చిన్న స్టూల్
మరిప్పుడు అది ఎక్కడుందో అని అటు ఇటు చూసీ రాస్తున్న.
ఇది ఎప్పుడో కొన్నారో తెలీదు నేను చిన్నపటినుండి అయితే దాన్ని చూస్తూ ఉన్న, నేను పుట్టాక ముందు నుండే ఉన్నట్టుండి బుడ్డది ఇప్పుడు కొంచెం ముసల్ది అయ్యింది.
నాన్న ఆఫీస్కు వెళ్ళేటప్పుడు స్టూల్ మీద కూసోని ఏదో ఆలోచించుకుంట్ట చాయ్ తాగి బూట్లు ఏసుకుంటుండే.
చిన్నప్పుడు హార్లిక్స్ డబ్బా అందకపోతే చిన్న స్టూల్ మీద నిలవడి ఒక చెంచా ఎడమ చేతిలో వేసుకొని అమ్మకి తెల్వకుండా నిమ్మళంగా ఏడున్న డబ్బా, స్టూల్ ఆడ వెట్టి ఆ పొడి నాకుంట్ట అశ్వదిస్తుండే.
ఇగ ఇంట్ల జర అమ్మ కన్నా ఎత్తున్న షెల్ఫ్ నుండి ఎం తీయాలన్న గాదె స్టూల్. ఇంటికి సూట్టల్ ఒస్తే చైర్లన్ని అయిపోతే మేము కూసోకున్న పర్వాలేదు అనుకునే వాళ్ళు స్టూల్ మీద కుసునే
వాళ్లు.
నేను తమ్ముడు స్టూల్ ని ఉల్టా చేశి నాలుగు కాళ్ళ మద్యల కూసోని ఒకరిని ఒకరు ఒంతులు వేసుకొని లాగుకుంట ఆడుకుంటుండే, అదేం సంబురమో.
నేను కొంచెం పెద్దయినంక అంటే బొమ్మల్తో ఆడుకునే టప్పుడు బొమ్మల పెళ్లి తర్వాత స్టూల్ కింద పక్క పరిచి అటు ఇటు పర్థలు కట్టి, స్కూల్ బుక్కుల అట్టముక్కల తో తలుపులు చేశి బొమ్మలకు ఇల్లు చేశి తర్వాత సినిమాల్లో చూశిన్నట్టు కేర్చిఫ్ మీద మల్లె పూలు వేసి కొత్తగా పెళ్ళైన నోరు జీవం లేని బొమ్మల్ని ఆ పూల మీద పాడుకోవేట్టి డోర్ దెగ్గరకు వేసి నిద్రపోతుండే. మళ్ళీ అటువైపు చూడొద్దు అని ఎవరు చెప్పలేదు కానీ మాకు మేమే డిసైడ్ అయిపోయి పొద్దున్నవరకు తలుపు తెర్వాలే, స్టూల్ జర్పాలే.
ఇంకా కొంచెం పెద్దయినంక నేను పెద్దమనిషి అయినప్పుడు బతటూమ్ ముందు చిన్న స్టూల్ వేసి అమ్మ ఇంటికి ఒచ్చి నన్ను మూలకి కూర్చోపెట్టడానికి అంత సిద్ధం చేసే వరకు, చిన్న స్టూల్ తప్ప నేను దేన్ని ముట్టుకోలేదు ముట్టనియ్యాలే.
మూడు, అయిదు, తొమ్మిది, పదకొండు రోజులు స్నానంకి స్టూల్ మీద కుసవేట్టే నెత్తి తడిపిర్రు.
ఇల్లు సర్దినప్పుడు పైన ఉన్న పుస్తకాలు కింద పెట్టాలన్న స్టూల్ ఎక్కాలి, ఒంట బండ మీదున్న అటుకుని ఎందుకోవాలన్నా స్టూల్ ఎక్కాలి.
స్టూల్ బరువు తగ్గిపోయింది ఇప్పుడు ఒకచేత్తో లేపగలుగుతున్న. కానీ అన్ని అందే అంత దూరంలో ఉన్నాయి. సోఫాలు కొత్త కుర్చీలు వచ్చేశానై. స్టూల్ మీద కూర్చునే అవస్రం రాలె.
ఇల్లంతా మారింది, బక్క టీవీ, పెద్ద ఫ్రిడ్జ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అన్ని కొత్త కొత్తవి ఒచ్చినై కానీ ఇది అట్లనే దాని పని అది చేస్కుంటా మంచం కింద దాస్కొని కొన్ని సార్లు, ఒంట రూమ్ ల అమ్మకి సాయం చేస్తూ కొన్ని సార్లు కనిపిస్తుంటది.
పడుకునే ముందు నాన్న బండి ఇంట్లో పెట్టి కింద స్టూల్ పెట్టి పడుకుంటుండే. బండి కధలోద్దని, మా మీద పడొద్దని. ఇంట్ల అంత తిరిగి అది బండి కింద సెటిల్ అయ్యింది.
నాన్నకి దీపం పెట్టేటప్పుడు ఇంట్ల సోఫా, కుర్చీలు అన్ని బయట పెట్టేష్ణ స్టూల్ మాత్రం ఇంట్లనే ఉంది నాన్నను చూస్తూ.
నాన్న తర్వాత బండి ఎప్పుడు ఇంట్లో పెట్టలేదు, స్టూల్ అవసరం రాలేదు. మరి ఆహా బుడ్డది ఏడుందో ఎం చేస్తుందో.
Comments
Post a Comment